This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
“కవికుల గురువు కాళిదాసు రచించిన నాటకాలలో విక్రమోర్వశీయం ఒకటి. నాయకుడు పురూరవుడు. నాయిక అప్సరస ఊర్వశి. పురూరవుడి విక్రమం చేత ఊర్వశిని పొందినాడు కాబట్టి ఈ నాటకానికి కవి విక్రమోర్వశీయం అని పేరు పెట్టాడు. పురూరవునికీ, ఊర్వశికీ సంబంధించిన కథలు ఋగ్వేదంలోనూ, విష్ణు, మత్స్య పురాణాలలోనూ, కథాసరిత్సాగరంలోనూ, భాగవతం లోనూ ఉన్నాయి. అయితే ఈ కథలన్నీ ఒక్క తీరుగా లేవు. కాళిదాసు మత్స్యపురాణ కథాక్రమాన్ని అనుసరించాడని ‘విల్సన్’ గుర్తించాడు. ఈ నాటకంలో పాత్రలు తక్కువ. ఉన్నంతవరకు పాత్రల చిత్రణ కవి చక్కగా చేసాడు.”
శ్రీమన్నారాయణుడి నాభికమలం నుండి బ్రహ్మ పుట్టాడు. బ్రహ్మ మానసపుత్రుడు మరీచి. మరీచికి కశ్యపుడు జన్మించాడు. కశ్యపునికి అదితి, దితి అని ఇద్దరు భార్యలు. అదితి యందు పుణ్యాత్ములైన దేవతలూ, దితి గర్భాన పాపాత్ములైన దానవులు జన్మించారు. కశ్యపునికి అదితి వలన పుట్టినవాడే వివస్వంతుడు. అతని భార్య సంఙ్ఞ. వారిరువురికీ శ్రాద్దాదేవుడనే కుమారుడు జన్మించాడు. అతనే వైవస్వంతుడన్న పేరుతో వర్తమాన మనువై భూమండలాన్ని పరిపాలించాడు.
వైవస్వంతుడికి చాలా కాలం పిల్లలు లేరు. సంతానార్ధం అతను ఒక యఙ్ఞం చేసాడు. ఆ యాగం చేయించినవాడు వశిష్ఠుడు. వైవస్వతుడు కుమారుడు కావాలని, అతని భార్య కుమార్తె కావాలని కోరుకున్నారు. చివరకు ఇళ అనే చక్కని కూతురు పుట్టింది. వైవస్వతుడు పుత్రిణ్ణి అనుగ్రహించమని కులగురువు వశిస్ఠుడిని వేడుకున్నాడు. అప్పుడు వశిస్ఠుడు హరిని ప్రార్ధించి ఇళకు పుంస్తయం వచ్చేటట్లు చేసాడు. ఆ విధంగా ఇళ మగపిల్లవాడైంది. అతనికి సుద్యుమ్నుడని పేరు పెట్టారు.
సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడైనాడు. ఒకనాడు గుఱ్ఱం ఎక్కి, పరివారంతో వేటకై ఉత్తరదిక్కుగా పోయి అరణ్యాలలో జంతువులను వేటాడుతూ మేరుపర్వతం ప్రాంతంలోని కుమారవనంలో ప్రవేశించాడు. అప్పుడొక చిత్రం జరిగింది. సుద్యుమ్నుడు ఆ వనంలో అడుగు పెట్టాడోలేదో వెంటనే స్త్రీరూపం వచ్చి ఇళ అయినాడు. అతని పరివారం అంతా కూడా స్త్రీలుగా మారిపోయారు.
ఇలా జరగడానికి ఒక కారణం ఉంది. శంకరుడు నిత్యం పార్వతితో కూడి విహరించే ప్రదేశం అది. ఒకప్పుడు శివుడు ఉమాదేవితో శృంగారక్రీడలు సాగిస్తూ ఆ వనంలో ఉండగా కొందరు మహర్షులు మహేశ్వరుని దర్శనార్ధం అక్కడికి వచ్చారు. వారు వచ్చిన సమయానికి పార్వతి వివస్త్రయై శివుని తొడపై కూర్చుని ఉంది. ఋషులు రావడం చూసి ఆమె సిగ్గుపడింది. వెంటనే అక్కడి నుంచి లేచి వస్త్రం ధరించింది. ఋషులు కూడా అది గ్రహించి ఇది సమయం కాదని అక్కడినుంచి వెళ్ళిపోయారు. అయితే ఇది జరిగినందుకు శివుడికి కోపం వచ్చి ‘తెలిసిగాని, తెలియక కానీ పురుషుడెవరైనాసరే కుమారవనంలో అడుగు పెడితే తక్షణం అతను స్త్రీ అయిపోవుగాక అని శాసించాడు. అదీ కథ. అప్పటి నుంచి పురుషులెవరూ ఆ ప్రదేశానికి వెళ్ళరు. ఈ విషయం తెలియక సుద్యుమ్నుడు అక్కడికి వెళ్ళడం వలన అతనికి, అతని పరివారానికి స్త్రీ రూపాలు వచ్చాయి.
ఇళ ఆ వనంలో తిరుగుతూ చివరకు బుధుని ఆశ్రమానికి వెళ్ళింది. బుధుడు చంద్రుని కుమారుడు. బుధుని వలన ఇళకు పురూరవుడనే చంద్రవంశపు రాజు కలిగాడు. పురూరవుడు షట్చక్రవర్తులో ఒకడు. గంగా యమునా సంగమ తీరాన గల ప్రతిష్ఠాన పురం ఇతని రాజధాని. ఇతను పాలించే లోకానికి మధ్యమలోకమని పేరు. పురూరవుని భార్య కాశీరాజ పుత్రి ఔశీనరి. రాజర్షి, సత్తముడైన పురూరవుడంటే దేవేంద్రుడికి అమిత అభిమానం. దానవులతో సంభవించే యుద్ధంలో పురూరవుడు ఇంద్రుడికి విజయం చేకూర్చేవాడు. పురూరవుడికి సోమదత్తం అనే ఓ దివ్య రధం ఉంది. లేడి చిహ్నం గల జెండా అతనిది. అతను దివ్యరధం ఎక్కి సమస్త లోకాలనూ సంచరించేవాడు.
దేవ వేశ్యలందరిలోకి ఊర్వశి అందాలరాశి. ఊర్వశి అంత అందకత్తె కావడానికి కారణం – పూర్వం శ్రీమన్నారాయణ మూర్తి గంధమాదన పర్వతంపై తపస్సు చేసుకుంటున్నాడు. అతని కఠోర తపస్సుకి మూడులోకాలు గజగజ వణికాయి. ఇంద్రుడు భయపడి ఎలాగైనా తపస్సు భంగం చేయాలనుకుని తనవద్ద ఉండే అప్సరసలలో అందమైన వారిని పిలిచి, నారాయణ ఋషి దగ్గరకు పోయి అతన్ని వశపరచుకో వలసిందిగా వారిని ఆఙ్ఞాపించాడు.
అప్సరసలు నారాయణ ఋషిదగ్గరకు పోయి ఆడారు, పాడారు. ఎన్నో వేషాలు వేసి, వలపులు కురిపించారు. అయినప్పటికీ భగవంతుడైన నారాయణ ఋషి ఇంచుకైనా చలించక, కళ్ళు తెరచి చూచి, వారికి బుద్ది చెప్పాలని సంకల్పించుకున్నాడు. వారు చూస్తూఉండగానే కొనగోటితో తన తొడగీరాడు. అప్పుడాయన తొడనుంచి జగన్మోహిని అయిన ఒక స్త్రీ జన్మించింది. నారాయణుని ఊరువు నుండి (తొడ నుండి) పుట్టడం వలన ఆమెకు ఊర్వశి అని పేరు వచ్చింది.
ఊర్వశి చక్కదనం చూచి, తమ అవివేకాన్ని గ్రహించి, అప్సరసలు మళ్ళీ ఇంద్రలోకం వెళ్ళిపోయారు. తర్వాత నారాయణ ఋషి తను సృష్టించిన ఊర్వశిని దేవేంద్రునికి ఇచ్చాడు. అప్పటినుంచి ఆమె స్వర్గానికి అలంకారంగా ఉంటూవచ్చింది. ఇంద్రుడు అవసరమైనప్పుడల్ల ఆమెను ‘కోమలాయుధం’ గా ఉపయోగించుకుంటున్నాడు.
ఓకనాడు ఊర్వశి చిత్రలేఖ, రంభ మొదలగు చెలికత్తెలతో కుబేరుని పట్టణమైన అలకాపురికి వెళ్ళి స్వర్గానికి తిరిగి పోతున్నది. కేశి అనే రాక్షసుడు ఊర్వశిని చూచి మోహించాడు. అతని నివాసం హిరణ్యపురం. ఆ పట్టణానికి ఆకాశ మార్గాన వెళ్ళాలి. కేశి ఊర్వసిని, చెలికత్తె చిత్రలేఖని చెఱపట్టి తీసుకు పోయాడు.
రంభ, మేనక తదితర అప్సరసలు బిగ్గరగా ఆక్రందనలు చేసారు. దివ్యరధంలో సంచరిస్తున్న పురూరవుడు వారివద్దకు వెళ్ళి విషయం తెలుసుకుని వారిని ఓదార్చి ధైర్యం చెప్పి ఈశాన్యదిక్కుగా బయలుదేరాడు. తిరిగి వచ్చేటప్పడికి తాము హేమకూట శిఖరంపై వేచి ఉంటామని అతనికి తెలియ చేసారు అప్సరసాంగనలు. పరాక్రమశాలి అయిన పురూరవుడికి ఈ పని ఒక అలెక్కలోది కాదని స్థిమితపడి పురూరవుడి రాకకై నిరీక్షిస్తున్నారు.
సోమదత్తం ఆఘమేఘాలమీద పరుగులు తీసింది. పురూరువుడు కేశి మార్గానికి అడ్డంగా తన రధాన్ని ఆపి, ఒకనిపై ఒకడు దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. గొప్ప యుద్దం జరిగింది. పురూరవుడు దివ్యాస్త్రమైన వాయువ్యాస్త్రాన్ని అభిమంత్రించి రాక్షసునిపై ప్రయోగించాడు. ఆ అస్త్రప్రయోగం వలన రాక్షసుడు అతని పరివారం ఒక ప్రచండ వాయువుకు కొట్టుకు పోయి సముద్రంలో పడ్డారు.
అంతట పురూరవుడు ఊర్వశిని, చిత్రలేఖనూ తన రధం మీద ఎక్కించుకుని తక్కిన అప్సరసాంగనలున్న హేమకూటానికి వచ్చాడు. అలా రధంలో వచ్చేటప్పుడు పురూరవుడు ఊర్వశి ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
ఎవరికీ తెలియని విషయం కూడా నారద మహర్షికి ఇట్టే తెలిసిపోతుంది. అతనికి తెలిస్తే మూడు లోకాలకి తెలిసినట్లే. అవును మరి. అతను త్రిలోక సంచారి. ఇక్కడి సంగతులు అక్కడ, అక్కడి సంగతులు ఇక్కడ చెప్పటం అతనికొక సరదా. ఆ విధంగా తగవులు కూడా పెడుతూ ఉంటాడు. అయితే నారదుడు చేసేపని లోకానికి ఉపకారంగానే పరిణమిస్తూ ఉంటుంది. అదీ విశేషం.
నారదుడు దేవలోకం వెళ్ళి ఊర్వశిని కేశి అనే రాక్షసుడు చెరపట్టి తీసుకుపోయాడన్న సంగతి ఇంద్రుడి చెవిలో ఊదాడు. అది వినగానే ఇంద్రుడికి ఆందోళన కలిగి చిత్రరధుడనే గంధర్వుడిని పిలిచి, విషయం వివరించి, ఊర్వశిని భద్రంగా తీసుకురా అని ఆదేశించాడు. అంతట చిత్రరధుడు గంధర్వ సేనలతో హుటాహుటిన బయలు దేరాడు. మార్గ మధ్యంలో కొందరు చారణులు ఎదురుపడి పురూరవ చక్రవర్తి కేశిని జయించి ఊర్వశిని విడిపించాడని, అంతా హిమగిరి శిఖరంపై ఉన్నారని తెలియజేసారు. సంతోషంతో వెంటనే హిమాద్రికి వచ్చాడు.
గంధర్వుడు రావడం చూచి పురూరవ చక్రవర్తి మర్యాద చేసి గౌరవించాడు. జరిగినదంతా అప్సరసలు చిత్రరధునికి చెప్పారు. పురూరవుడు ఇంద్రుడికి మహోపకారం చేసాడని ఎన్నో విధాల పొగిడి స్వర్గానికి రమ్మనమని ఆహ్వానించాడు చిత్రరధుడు. ఈ సూచన చాలా బాగున్నదని ఊర్వశి, తక్కిన అప్సరసలు సమర్ధించారు. అయితే పురూరవుడు ఊర్వశిని రక్షించడంలో తన ప్రతాపం ఏమీ లేదని సవినయంగా చెప్పి, వారి ఆహ్వానాన్ని ఇప్పుడు అంగీకరించనందుకు మన్నించవలసిందని కోరాడు. ఊర్వశి పురూరవుడు తనతో రానందుకు లోలోపల విచారించింది. అతని వియోగం ఆమెకు దుర్భరముగా తోచింది.
ఊర్వశిని, అప్సరసలను తీసుకుని చిత్రరధుడు దేవలోకానికి బయలుదేరాడు. తన ప్రాణాలు కాపాడిన చక్రవర్తికి కృతఙ్ఞత చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుందామని అనుకుంది ఊర్వశి. స్వయంగా మాట్లాడడానికి సిగ్గుపడి తన అభిలాషను ప్రాణసఖి అయిన చిత్రలేఖకు చెప్పింది. చిత్రలేఖ పురూరవుని వద్దకు వెళ్ళి ఊర్వశి అభిప్రాయం తెలియచేసింది. ఊర్వశికి దుఃఖం పొర్లివస్తూఉండగా వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి పురూరవుని చూస్తూ వెళ్ళింది. తన చెలికి రాజుపై మోహం పుట్టిందని చిత్రలేఖ తెలుసుకుంది.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000