This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
“అలాగే” అంటూ ఆ సెక్షన్ వైపు నడిచాడు రాహుల్, మురళిని తీసుకొని.
“మీ మధ్య బాగా చనువు ఉన్నట్టు ఉంది.” అన్నాడు మురళి, రాహుల్ తో.
“మా మధ్య సదావగాహన ఉంది.” చెప్పాడు.
రాహుల్ తనకు కేటాయింపబడ్డ పనిని చేస్తున్నాడు. రాహుల్ ఎదురుగా కూచుని, అతడు చేస్తున్న పనిని తదేకంగా చూస్తున్నాడు మురళి.
“సంజూ ఏమో వెరీ గుడ్ వర్కర్. ఆమెది సిన్సియర్ అండ్ ప్రాంప్ట్ వర్కింగ్.” అన్నాడు రాహుల్ – ఆమె రూపొందించిన ప్లాకేజీని పరిశీలిస్తూ.
అప్పుడే, “ఆమెను నీ ఉడ్ బి అనుకోవచ్చా?” అడిగాడు మురళి, చనువుగా.
జవాబు చెప్పలేదు రాహుల్.
క్షణమాగి, “సరే, నేను బయటకెళ్లి వస్తాను.” అన్నాడు మురళి, కుర్చీలోనించి లేస్తూ.
అదే రోజు సాయంకాలం –
తలుపు తెరిచింది సంజు.
“త్వరగానే వచ్చేశావు” అంది లోనికి వస్తూన్న రాహుల్ తో.
రాహుల్ నేరుగా వెళ్లి, హాలు మధ్యలో ఉన్న సోఫాలో కూచున్నాడు.
బూటుల్లోనించి పాదాలను బయటకు తీస్తూ, రాహుల్ చెప్పాడు – “సిస్టమ్స్ ను నాకు అప్పగించి, నువ్వు వచ్చేసిన కొద్దిసేపటికే వాళ్లు వచ్చారు.”
రాహుల్ పక్కన ఎడమగా కూచుంటూ – “సిస్టమ్స్ ఎలా ఉన్నాయన్నారు?” అడిగింది సంజు.
టీపాయ్ మీద నున్న మాగ్జెన్ ను అందుకుంటూ, “నువ్వు ఫిట్ చేశావుగా. వాటిలో ఇంకా తేడాలుంటాయా!” చెప్పాడు రాహుల్.
“మరి, అందుకు నీ సహకారం ఎంతో”
“స్కేలుతే” అన్నాడు రాహుల్.
“ఎందుకు?” అడిగింది సంజు.
“కొలిచి చెప్తా.” చెప్పాడు రాహుల్, తమాషాగా.
చిలిపిగా నవ్వేసింది సంజు.
చేతిలోని మాగ్జైన్ పేజీలు తిరగవేస్తూ, సంజు వంక చూస్తూ, “ఇంకా నువ్వు రిప్రెష్ కానట్టు ఉంది.” అన్నాడు రాహుల్.
“నేనూ ఇప్పుడే వచ్చాను. యూనిట్ నుండి వస్తుండగా మా డాడీ దార్లో ఎదురయ్యారు. ఇంటి తాళాలు ఇవ్వడానికి వస్తున్నారట.” చెప్పింది సంజు.
“ఏం, మీ మమ్మీ ఇంట్లో లేరా?” అడిగాడు రాహుల్.
“లేరు. పుట్టింటికి వెళ్లింది. ఎప్పుడూ జరిగేదేగా. పొరుగూరు కావడంతో చీటికి మాటికి అలిగి వెళ్లి పోవడం, కొద్ది రోజుల తర్వాత, ఈయనగారు వెళ్లి, బ్రతిమాలి, నచ్చచెప్పి, ఆవిడగారిని తీసుకు రావడం మామూలేగా.” చెప్పింది సంజు.
“ఈసారి మీ మమ్మీ ఎందుకు అలిగారు?” అడిగాడు రాహుల్, చిన్నగా నవ్వుతూ.
“మా మమ్మీ ఈ మధ్య తనకు తెలిసిన ఆవిడ వద్ద ఒక లేటెస్టు కాశీమాల నెక్లెస్ చూసిందట. అలాంటిది చేయించమందట. కుదరదని మా డాడీ చెప్పడంతో అలిగిందట.” చెప్పింది సంజు.
చేతిలో మాగ్జైన్ ను టీపాయ్ మీద పడేసి, “ఎంతో ఎబ్బెట్టుగా ఉంటోంది, వీళ్ల తంతు. మా మమ్మీ అహంతో పోయింది. మీ మమ్మీ అలకతో పోతోంది. ఇద్దరిదీ మూర్ఖత్వమే. మన తండ్రులది మరీ అలసత్వం.” అన్నాడు రాహుల్.
“అవును” అంది సంజు.
“మా ఫ్రెండ్ మురళి పేరంట్స్ కూడా ఇంతేనట.” చెప్పాడు రాహుల్.
“వాళ్లదేమిటి?” అడిగింది సంజు.
“వాళ్లది, ఎవరి సొద వాళ్లదట. ఇంటినే పట్టించుకోక, అనవసరమైన విషయాల్ని పట్టుకు వ్రేలాడుతారట. అనవసర క్యాంపులు తిరుగుతారట.”
“అవునా, ఈ పెద్దలకు ఈ మనస్తత్వాలేమిటో!” అంది సంజు.
“ఏమో, వీళ్ల గురించి ఏం చెప్పగలం. ఎలా సమర్థించగలం.” అన్నాడు రాహుల్.
“సర్లే, లే, రిఫ్రెషై రా. కాఫీ కలుపుతాను.” చెప్పింది సంజు, సోఫాలోనించి లేస్తూ.
రాహుల్ కూడా సోఫాలోనించి లేచాడు. వెళ్తున్న సంజును పిలిచాడు.
సంజు ఆగి, తిరిగి చూసింది.
“నాకు కాఫీ వద్దు” చెప్పాడు రాహుల్.
“మరి” – సంజు.
“జూస్ కలుపవా” చెప్పాడు రాహుల్.
“ఏ జూస్?”
“నీ పెదాల జూస్”
“వాట్!”
“మరే, నే నడిగేది ‘ఆపిల్ స్లయిడ్’ల జూస్, సంజూ.”
“దాంట్లో కొత్తి మీర కట్ట మిక్స్ చెయ్యనా?”
“కొత్తి మీర కట్టా” – ఆశ్చర్యంగా అన్నాడు.
“మరే, నే నన్నది నీ ‘బొద్దు మీసం’ గురించి.”
క్షణం తర్వాత – ఇద్దరూ సరదాగా నవ్వుకున్నారు.
వారం తర్వాత, ఒక రోజు ఉదయం, మేడ మీద గది తలుపు తట్టింది సంజు.
తలుపు చప్పుడుతో నిద్రలోనించి బయట పడ్డాడు రాహుల్. లేచి, వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా సంజు.
“ఆయ్” అన్నాడు రాహుల్.
“డిటో” అంది సంజు, గదిలోకి వస్తూ.
“ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు” అన్నాడు రాహుల్, సంజును పరిశీలనగా చూస్తూ.
“వాక్యంలో వెలితి ఉంది.” వెంటనే అంది సంజు.
రాహుల్ క్షణం షేక్ అయ్యాడు.
సుతిమెత్తగా నవ్వింది సంజు.
సర్దుకొని, చెప్పాడు, “ఈ రోజు కూడా నువ్వు చాలా బాగున్నావు.”
“దట్స్ గుడ్.” గలగల నవ్వేసింది సంజు. పిమ్మట –
“బ్రష్ చేసుకురా” చెప్పింది సంజు.
“ఎందుకు” – కొంటెగా అడిగాడు రాహుల్.
“ముద్దు ఇద్దామని” – అదే రీతిలో చెప్పింది సంజు.
“నిజమా” అన్నాడు రాహుల్, కళ్లు సాగతీస్తూ.
“నిజమ్” అంది సంజు, బుంగమూతితో.
“ఆ కొత్త థ్రిల్ నాకు తప్పక కావాలి.” అంటూ బాత్రూంలోకి వెంటనే దూరాడు రాహుల్.
తనలో తాను నవ్వుకుంది సంజు. పరికించి చూస్తోంది, ఆ గది అంతటిని. ఆమె దృష్టి టేబుల్ మీద ఉన్న రాహుల్ కళ్లద్దాలపై నిల్చింది.
నిముషాల్లో పని ముగించుకొని, తిరిగి వచ్చాడు రాహుల్ – “నేను రడీ” అన్నాడు, హుషార్ గా.
తలాడిస్తూ రాహుల్ కళ్లద్దాలను అందుకొంది సంజు.
“అవి ఎందుకు!?” అడిగాడు రాహుల్.
సంజు నవ్వుతూ, ఆ కళ్లద్దాలలో ఒక అద్దాన్ని రాహుల్ పెదాలకు ఆన్చి – “కదలకు” అంటూ ఆ అద్దానికి ఇటు వైపున తన పెదాలను ఆన్చింది, ‘ప్చ్’ అన్న గాఢమైన ధ్వనితో.
రాహుల్ కాస్తా జర్క్ అయ్యాడు. పిమ్మట ఏదో గమ్మత్తుకు లోనయ్యాడు.
అంతలోనే ‘ఇంటర్ కమ్’ మ్రోగింది. తేరుకుంటూ దాన్ని అందుకున్నాడు రాహుల్.
“ఇద్దరూ టీకి రండి” – రాఘవరావు చెప్పారు, కిందనించి. వెంటనే ఇంటర్ కమ్ కట్ చేసేశారు.
“సంజు, మీ డాడీ రమ్మంటున్నారు టీకి”
“రాత్రి మా డాడీ యూనిట్ అకౌంట్ పొజిషన్ ఎలా ఉందని అడిగారు, ఎందుకో.”
చెప్పింది సంజు.
రాహుల్ మౌనంగా సంజు వంక చూశాడు.
“నేను ఏమీ చెప్పలేదు” చెప్పింది సంజు.
“ఏం. నీకు తెలుసుగా.” అన్నాడు రాహుల్.
“అఫ్ కోర్స్, లోన్ ఎప్పుడో తీర్చేశావు. అమౌంట్ సిక్స్ డిజిట్స్ లో నిల్వ ఉంది. బట్. ఈ విషయాలు చెప్పాలా, వద్దా అన్నది నీ ఇష్టం.” చెప్పింది సంజు.
“సరే, పద, టీకి.” అంటూ అక్కడనుండి కదిలాడు రాహుల్.
సంజు, రాహుల్ వెంట దిగింది.
అదే రోజు సాయంకాలం –
రాఘవరావు ఆహ్వానంతో రాహుల్ తండ్రి ముకుందం వచ్చారు, ఒంటరిగా.
డిన్నర్ దగ్గర, రాహుల్ తో రాఘవరావు చెప్పారు, ఉత్సాహంగా – “మీ డాడీతో నేను మాట్లాడాను. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు”
“దేనికి అంకుల్?” అడిగాడు రాహుల్.
“పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి” చెప్పారు.
“పెళ్లా, ఎవరికి?” అడిగాడు రాహుల్.
“నీకు, సంజుకు” చెప్పారు రాఘవరావు.
కొన్ని క్షణాల పాటు రాహుల్, సంజులు చూపులు కలుపుకొని, పిమ్మట, “మేము ఇలానే కలిసి ఉంటాం – మెసులు కుంటాం” చెప్పారు కోరస్ గా.
విస్తుపోయారు ఆ ఇద్దరి పెద్దలు. ఆందోళనగా అడిగారు, “అదేమిటి?” అంటూ.
“అంతే, మేము గట్టిగా నిశ్చయించుకున్నాం. థర్డ్ పర్షన్ ఇష్టాయిష్టాలతో ఏ మాత్రం ప్రమేయం లేకుండా మేము ఇలానే ఉండాలనుకుంటున్నాం.” అన్నాడు రాహుల్.
“మీది సంసారం అనిపించుకోదు” విసురుగా అన్నారు రాఘవరావు, రాహుల్ వంక, సంజు వంక అయోమయంగా చూస్తూ.
“ఎందుకు కాదు. కలుషితం కాని, సంఘర్షణ లేని ‘సం’సారం కావాలి, మా జంట. అదే మా ఆశయం కూడా.” అంది సంజు.
“మీది అక్రమ సంబంధం అవుతుంది.” వెంటనే అన్నారు ముకుందం.
“కాదు – కాదు, ముమ్మాటికి కాదు. ఆదర్శంగా నిలిచే సక్రమ ‘సం’బంధంగా నిలుస్తోంది, మా జంట” అన్నాడు రాహుల్, నమ్మకంగా.
“తప్పు, పెళ్లి చేసుకోండి.” చెప్పారు రాఘవరావు.
“పెళ్లా – పెళ్లి ఎందుకు?” కోరస్ గా అడిగారు, రాహుల్, సంజులు.
“అదేమిటి?” అన్నారు ముకుందం.
“అదేమిటా – పెళ్లి చేసుకొని సంసారం ఏర్పచ్చుకొని, దానికి మీరు ఏం విలువ నిచ్చారు.
దాని పవిత్రతను ఏం చేశారు.
దాని మృదుత్వంను ఏం కాపాడారు.
దానిలో ఉన్న మాధుర్యాన్ని ఏం అనుభవించారు.
అహంకారం, పౌరుషాలుతో మా తల్లిదండ్రులున్నూ –
అలకలు, ఉపేక్షలుతో ఆంటీ, మీరున్నూ –
బాధ్యతా రాహిత్య ప్రవర్తనలతో నా పరిచయస్తుడు మురళి తల్లిదండ్రులున్నూ – ఇలా అనైక్యతగా, అలక్ష్యంగా ప్రవర్తిస్తూ, వివాహ వ్యవస్థనే మీరంతా భ్రస్టు పట్టించారు.
మాకు పెళ్లి అంటేనే కంపరం పుట్టేలా చేశారు.” చెప్పాడు రాహుల్.
ఇంతలో సంజు – “అందుకే, ఆనందానుభూతులను మావి మాకుగా అపరిమితంగా అనుభవిస్తూ, ఎవరు ఏమనుకున్నా, మేము మాత్రం ఇలానే కలిసిమెలిసి స్వేచ్ఛాజీవులుగానే ఉంటాం.” చెప్పింది.
ఆ వెంటనే రాహుల్ – “మేము పెళ్లి చేసుకోవాలనే మీరు మనస్ఫూర్తిగా ఆశిస్తే,
కనీసం ముందు మీరు మీ సంసారాలను చక్కదిద్దుకోండి. లేదా మా జోలికి మీరు రాకండి.” అన్నాడు.
ఆ మాటలు విన్న, ఆ పెద్దలు నిర్ఘంతపోయారు.
రాహుల్, సంజులు అక్కడనించి వచ్చేశారు.
కానీ, వాళ్లు, ‘తమకు రిజిస్టర్ మారేజీ జరిగిపోయింది’ అనే సంగతిని బయట పెట్టలేదు.
కొద్ది నెలల తర్వాత – మంచి భావాలతో వాస్తవాలను తెలియ చెప్పి, వింత ప్రణాళికతో తాము ఆశించిన ఫలితాన్ని పొంది – తమ తల్లిదండ్రులచేత, వేడుకగా పెళ్లి చేయించుకొన్న రాహుల్, సంజులు పెద్దల ఆశీస్సులు పొందారు.
అదే రోజు రాత్రి – అందంగా అలకరించ బడ్డ ఆ గదిలోని ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ –
రాహుల్, సంజుల పెదాల మధ్య కమలాపండు తొన సున్నితంగా అదమబడు తోంది. ఆ పెదాలు సుతిమెత్తగా ముందుకు జరుగుతున్నాయి. ఆ తొన వ్యాకోచనం చెందు తోంది, ఆ పెదాల ఒత్తిడికి. ఒక క్షణాన అది ‘టప్’ మని పగిలింది. రసం చిమ్మింది. ఆ చిట్లిన తొన జారి పోతుండగా, చటుక్కున తన పై పెదవితో కింద పెదవిని పట్టుకుంది సంజు. అంతే – ఆ పెదాల మధ్యన రాహుల్ పెదవి పట్టు బడింది, ఈసారి.
ఆ చిట్లిన తొన ‘మధురానికి రుచి ఇలా కూడా ఉంటుంది’ అని అనుకొనేందుకు రాహుల్, సంజులను మంచం మీదకు ఒడుపుగా చేరవేసింది.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000