బావ మళ్ళీ వస్తాడో!

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000

పద్దెనిమిదేళ్ళ పరువాల కొమ్మ రమణి. ఆకు చాటున మావిడిపిందెలా ముగ్ధంగా ఉంటుంది. ముట్టుకుంటే కందిపోయే ఈ అందాలబొమ్మకి అమాయకత్వం ఒక అదనపు అలంకారం. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తమ్ముడు, ముగ్గురు పనివాళ్ళు….ఇంతమందితో నిత్యం కళకళలాడే ఇల్లు ఆమెది. ఆమె పొరపాటున తుమ్మితే ఇంటిల్లపాదీ ఉపవాసాలు చేసేటంత ఆప్యాయత, అనురాగం ఆమె సొంతం.

ఇక ఊరిలో, ఆమె ఎదురొస్తే చాలు, తమకి ఆ రోజు బంగారు పంటే అని ఊరివాళ్ళంతా అనుకొనేంత మంచి పేరు. అలాంటి రమణికి ఒక కబురు గుబులు రేపింది. ఆ కబురు ఏమిటంటే, ఆమె బావ వస్తున్నాడని. అక్కడనుండి ఇక్కడనుండీ కాదు, ఏకంగా అమెరికా నుండి. ఆ వార్త కాదు ఆమె గుబులుకి కారణం. అతను వస్తే, అతనికి తను నచ్చితే, అతనికి ఇచ్చి పెళ్ళి చేసేస్తారంట. దాని గురించికూడా కాదు బెంగ.

పెళ్ళయిన తరువాత తనని బావతో పాటూ పంపేస్తారట. తాత, నానమ్మ, అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తమ్ముడు…వీళ్ళెవ్వరూ రారంట. అదీ అసలు బాధ. దీనిగురించే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించింది. పరిష్కారం దొరకలేదు గానీ, కొత్త సమస్య ఎదురయ్యింది. నిద్రలేక ఎర్రబడ్డ కళ్ళని చూసి, పక్కంటి అత్తయ్య మేళమాడింది, ” ఏంటి పిల్లా, బావ గురించి రాత్రంతా కలలు గన్నావా ఏమిటీ? కళ్ళన్నీ ఎర్రబడ్డాయ్.” అని. ఊర్లో విషయం తెలిసిన అమ్మలక్కలందరూ ఎర్రబడ్డ కళ్ళు చూసి ముసిముసిగా నవ్వుకోవడమే.

అది చూసి ఉక్రోషం పొంగుకొచ్చింది రమణికి. దీనికంతటికీ కారణమైన బావని ఎలాగైనా తరిమేయాలి అనుకుంది. అలా అనుకున్న తరువాత, ఆమె కాస్త చల్లబడింది. ఆ నిర్ణయంతో ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది. మర్నాటికి కళ్ళు తేటనీటిలా తెల్లబడ్డయి. అద్దంలో చూసుకొని హమ్మయ్య అనుకుంది. చుట్టుపక్కల అమ్మలక్కలు ఆమె మొహం చూసి కిసుక్కున నవ్వారు. “ఎందుకే నవ్వుతున్నారూ?” అని ఉక్రోషంగా అడిగింది రమణి. “మీ బావ వస్తున్నడనా, నీ మొహంలో అంత కళ వచ్చేసిందీ?” అంది ఒకావిడ.

“అది మామూలు కళ కాదే, పెళ్ళికళ.” అంటూ మరొకావిడ వత్తాసు పలికింది. ఆ మాటలకు ఉడుక్కుంటూ ఇంట్లోకి పోయింది రమణి. ఇంతటికీ కారణం అయిన బావ అంటే మరింత కోపం వచ్చేసింది. ఆ కోపంతోనే అలిగి కూర్చుంది. బావ వస్తున్నాడని, ఏర్పాట్లలో మునిగిపోయిన ఇంట్లో వాళ్ళెవ్వరూ, ఆమె అలిగిన విషయం గుర్తించలేదు. బావపై కోపం ఇక అంతులేకుండా పెరిగిపోయింది. ఆ రావణాసురుడుని ఎలాగైనా తరిమేయాలనుకుంది. అవునుమరి, ఇంట్లో వాళ్ళ దగ్గరనుండి తనని ఎత్తుకుపోయేవాడు రాక్షసుడు గాక మరేం అవుతాడు.

ఆమె కోపానికి కారణమైన బావ రానే వచ్చాడు. పిన్ని వచ్చి చెప్పింది, “చిట్టితల్లీ, స్నానం చేసి తయారవ్వమ్మా…బావ వచ్చాడు.” అని. “నేను చస్తే బావని చూడను. బావ నకు నచ్చలేదు. వెళ్ళిపొమ్మను.” అని గట్టిగా అరిచి ముసుగు తన్నేసింది. ఏంచేయాలో అర్ధం కాక రమణి వాళ్ళ అమ్మకి కబురు చేరేసింది పిన్ని. అక్కడనుండి మగాళ్ళకి చేరిపోయింది కబురు. చివరగా బావకి చేరింది విషయం. అతను నవ్వేస్తూ “కొత్తగా చూసేదేముంది మావయ్యా! చిన్నప్పుడు చూసా కదా. పైగా ఇంకా రెండు రోజులుంటాగా, తనని కంగారు పెట్టకండి పాపం.” అన్నాడు. ఆ విషయం రమణి నాన్న నుండి ఆమె తల్లికీ. ఆమె నుండి పిన్నికీ, అక్కడనుండి రమణికీ తెలిసింది. “బావ అనుకున్నంత చెడ్డేం కాదు.” అనుకుంది. దానితో ఆమె కోపం కాస్త తగ్గింది. కొద్దిసేపటి తరువాత భోజనానికి రమ్మని పిన్ని పిలిస్తే తరవాత వస్తానని చెప్పింది. అలగడమైతే అలిగింది గానీ, పాపం ఆకలికి అలక ఎంతసేపు ఉంటుందీ!?

బయటకి వచ్చి వంటగది వైపు వస్తుంటే, అప్పటికే భోజనాలు చేసేసిన వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. ఇంతలో ఎవరో అడిగారు రమణిని, “కాస్త నీళ్ళిస్తావా?” అని. రమణి ఆగిపోయింది. ఎప్పుడూ వినని గొంతు అది. చాలా మృదువుగా ఉంది. తిరిగి చూస్తే ఒక ఇరవై రెండేళ్ళ యువకుడు కనిపించాడు. సన్నగా, నాజూకుగా ఉన్నాడు. ఎర్రగా, బుర్రగా ఉన్నాడు. అన్నిటికీ మించి సుకుమారంగా ఉన్నాడు. ఎందుకో అతన్ని చూస్తే సిగ్గుగా అనిపించింది. ఇంకా ఏదో అనిపించింది కానీ, ఆ ఏదో అంటే ఏమిటో ఆమెకి అర్ధం కాలేదు.

ఆ ఏదో ఇదిలోనే నీళ్ళు అందించింది. అతను అందుకుంటుంటే, అతని వేళ్ళు తగిలాయి. ఎందుకో జిమ్ అని లాగింది ఆమెకి. ఒక్క ఉదుటున పరుగెత్తుకి వెళ్ళి, అమ్మ వెనక్కి వెళ్ళి దాక్కొని “ఎవరమ్మా అతనూ?” అంది. “ఎవరే!?” అంటూ వెనక్కి తిరిగి చూసి, నవ్వుతూ “ఇంకెవరే, నీ బావ.” అంది. “అవునా!” అనుకుకుంది మనసులో. “రావణుడిలా లేడు, రాముడిలాగే ఉన్నాడు. అయితే బావ విలన్ కాదా!” అని రకరకాలుగా ఆలోచిస్తూ, ఆ ఆలోచనలలోనే అమ్మ తినిపించిన బువ్వ తినేసి, డాబా పైకి పరుగెత్తింది. అక్కడి నుండి చూస్తే కింద అందరూ కనిపిస్తున్నారు. బావ కూడా. నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా నవ్వుతుంటే, తనకు ఏదో అవుతుంది. ఏమవుతుందో అర్ధం కావడం లేదు. ఇంతలో నాన్న పిలిచాడు. పరుగెత్తుకు వెళ్ళింది. అక్కడే బావ ఉండడంతో, అతనికి కనిపించకుండా నాన్న వెనక చేరింది.

ఆమెని గమనించిన నాన్న, చిన్నగా నవ్వుకుంటూ “తల్లీ! బావకి, స్కూల్లో నీకొచ్చిన ప్రైజ్ లు చూపిస్తావా?” అన్నాడు. ఆమె తండ్రి మెడ వెనక నుండి బావని చూసింది. అతను తనని గమనించక పోవడంతో, ఇంకాస్త పరీక్షగా చూసింది. గుబులుగా అనిపించింది ఆమెకి. అయితే ఇంతకు ముందు వచ్చిన గుబులు కాదది. మళ్ళీ అర్ధంకాని ఏదో గుబులు. “ఏరా! చూపిస్తావా?” తిరిగి అన్నాడు నాన్న. “ఊఁ..” అని తుర్రున తన గదిలోకి పరుగెత్తింది. గదిలోకి వెళ్ళగానే తనను తాను అద్దంలో చూసుకుంది. “ఛీ..బావే బాగున్నాడు.” అని చిన్నబుచ్చుకొని, వంటిపై ఓణీ తీసేసి. గబగబా బీరువా తెరిచి, మంచి ఓణీ కోసం గాలిస్తూ, నచ్చనివి బయటకు పారేస్తుంది. “ఎక్కువ వెతక్కు. ఇలాగే బావున్నావు.” అన్న మాటలు విని గుండె ఝల్లుమంది. వెనక్కి తిరిగి చూస్తే, బావ నవ్వుతూ నిలబడ్డాడు. గబుక్కున గోడకు ఆనుకొని, సిగ్గుతో గట్టిగా కళ్ళు మూసేసుకుంది. దగ్గరకి వస్తున్నట్టు అతని అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఎందుకో ఆమె కాళ్ళు సన్నగా వణుకుతున్నాయి.

అతను దగ్గరకి వచ్చేసాడు. అతని ఊపిరి తనకి తగిలేంత దగ్గరగా నిలుచున్నాడు. గట్టిగా పిడికిళ్ళు బిగించేసింది. “గుడ్. బావున్నాయి.” అన్నాడు చెవిలో రహస్యంగా. ఏం బావున్నాయో అర్ధం కావడం లేదామెకి. ఆమెకి ఊపిరి అందడం లేదు. “మరి ఈ ప్రైజులు నాకిస్తావా?” అన్నాడు. నోటివెంట మాట రావడం లేదు ఆమెకి. ఆమె నడుము మీద వేలితో రాస్తూ “ఇస్తావో లేదో చెబితే వెళ్ళిపోతాను.” అన్నాడు. ఆమెకి వళ్ళు వేడెక్కిపోతుంది. ఇప్పుడు జ్వరం ఎందుకొస్తుందో అర్ధం కావడం లేదు. అయినా ఇంటకు ముందు వచ్చిన జ్వరంలా లేదది. ఏదో హాయిగా ఉంది. “ఏం పాడు జ్వరమమ్మా ఇదీ!” అనుకుంది. అతను వేలిని ముందుకు జరిపి, నాభి దగ్గర రాస్తూ “సరే..నీకివ్వడం ఇష్టం లేదు కదా, వెళ్ళిపోతాలే.” అన్నాడు. అతని అడుగుల చప్పుడు దూరం అవడం వినిపిస్తుంది. కళ్ళు తెరిచింది. అతను గదిలోంచి బయటకి వెళ్ళిపోయాడు. “మళ్ళీ వస్తాడా?” అనుకుంటూ గుమ్మంలోంచి తొంగిచూసింది. రాలేదు. ఎందుకో ఆమెకే తెలీకుండా వేడి నిట్టూర్పు వచ్చింది.

తనకి ఏమవుతుందో అర్ధం కావడం లేదు. నడుము మీద బావ వేలి స్పర్శ ఇంకా గిలిగింతలు పెడుతుంది. నడుముకీ, బుగ్గలకీ ఉన్న సంబంధం ఏమిటో గానీ…అవి ఎర్రబడ్డాయి. “బావ మళ్ళీ రాడా?” అనుకుంది ఇంకోసారి. “అమ్మో! వస్తే ఇక్కడనుండి తీసుకుపోతాడు. వద్దులే.” అనుకుంది. అంతలోనే నాభి దగ్గర బావ చేతి స్పర్శ “బావ మళ్ళీ వస్తాడో, రాడో.” అని అనుకొనేలా చేస్తుంది. అంతలోనే తన మేనత్తని, మావయ్య పెళ్ళి చేసుకొని తీసుకుపోవడం గుర్తొచ్చింది. అత్త ఎంత ఏడ్చిందో…అదేంటో గానీ మళ్ళీ మావయ్య ఇక్కడ దింపినపుడు మావయ్య వెళ్ళిపోతుంటే ఏడ్చింది. తనకూ అలానే అవుతుందా!? “అబ్బా, పాడుబావ. వచ్చి ఒక్కరోజు కాలేదు గానీ, ఏదో చేసేసాడు.” అని విసుక్కుంది. ఆ విసుగులోనే నవ్వువచ్చింది. ఇంతలో గుమ్మంలో అలికిడి వినిపించింది. “అమ్మో…బావ వస్తున్నాడు.” అనుకుంటుంటేనే మళ్ళీ జ్వరం వచ్చేసినట్టు వళ్ళు వేడెక్కిపోయింది. కానీ వచ్చింది బావ కాదు, పిన్ని. లోపలకి రాగానే నవ్వుతూ “ఎంటే, మీ బావకి ఇలాగే కనిపించావా?” అంది. సిగ్గుల మొగ్గ అయింది రమణి. “సిగ్గు పడింది చాలులే, మీ బావ వెళ్ళిపోతున్నాడు.

ఆ ఓణీ వేసుకొని రా.” అని బుగ్గలు చిదిమి వెళ్ళిపోయింది. ఆ మాటలు వినగానే ఆమె గుండెలో రాయి పడినట్టు అయింది. “అయ్యో, వెళ్ళిపోతున్నాడా!” అనుకుంటూ అలాగే పరుగెత్తి, డాబా పైనుండి చూస్తుంది. బావ కారులో బేగ్ పెడుతున్నాడు. “అప్పుడే వెళ్ళిపోవడమేంటీ? అయ్యో, ఒక్కసారి చూడు బావా!” అనుకుంటుంది. అతను కార్ తలుపు తీసాడు. అందరూ చేతులు ఊపుతూ టాటా చెబుతున్నారు. ఒక్కసారిగా అందరిమీదా కోపం వచ్చేసింది. “ఎవరూ ఆగమని చేప్పరేం?” అని తిట్టుకుంటుంది. “అయ్యో, బావా! వెళితే వెళ్ళావ్ గానీ, మళ్ళీ రావా!” అనుకుంది మనసులో. అతను కారులోకి ఎక్కబోతూ, పైకి చూసాడు. తననే చూస్తున్న రమణిని చూస్తూ నవ్వుతూ టాటా చెప్పాడు. మళ్ళీ జ్వరమొచ్చింది ఆమెకి.

(అయిపోయింది.)

This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000