This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000
ఇది భేతాళుడి కథ…
శాపవశాత్తూ భేతాళుడు శవ రూపంలో చెట్టుపై ఉండిపోతాడు. ఇతడు పూర్వ జన్మలో తపఃసంపన్నుడైన బ్రాహ్మణుడు. కైలాసంలో మహాశివుడిని పార్వతీదేవి ఒక కోరిక కోరుతుందట. తనకు కథలు చెప్పమని, అవి ఇంతవరకూ ఎవరికీ తెలియనివి, ఎవరికీ ఎవరూ చెప్పుకోనివి అయ్యుండాలని పార్వతీ దేవి తన నాథుడిని కోరుతుంది. తన సఖి కోరిక మేరకు అద్భుతమైన కొన్ని కథలను చెబుతాడు మహాశివుడు. పార్వతీ పరమేశ్వరుల ఈ సంవాదాన్ని చాటుగా వింటాడు ఆ బ్రహ్మణుడు. ఎంతో ఉత్కంఠత ను కలిగించే ఆ అద్భుతమైన కథలను విన్న బ్రహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి గురవుతాడు. ఆ కథలను తన మనసులోనే దాచుకోలేక వెంటనే తన భార్యకు చెప్పేస్తాడు. ఎవరికీ చెప్పకు అనే షరతు కూడా పెడతాడు. అయితే ఆమె బ్రహ్మణుడి వలే తాళలేక తన తోటి మహిళలందరికీ చెప్పేస్తుంది. వారి నుంచి అనేక మందిలో ఈ కథలకు ప్రాచుర్యం వస్తుంది.
ఆ తర్వాత ఆ నోట ఈ నోట పడిన ఈ కథలు చివరకు పార్వతీ దేవి చెవిన పడతాయి. పరమశివుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుందామె. భూలోకంలో ప్రాచుర్యం పొందిన కథలను తనకు చెప్పి అవమానించావని శివుడిని నిందిస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందో సమీక్షించిన శివుడు బ్రహ్మణుడి వృత్తాంతాన్ని గ్రహిస్తాడు. తమ ఏకాంత సంవాదాన్ని విన్నాడనే కోపంతో, విన్న కథలను ఒక మేధావికి చెప్పి చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకొనే వరకూ భేతాళుడిగా ఉండిపొమ్మని శపిస్తాడు. అలా బ్రహ్మణుడు భేతాళుడిగా మారి విక్రమార్కుడి కోసం ఎదురుచూస్తుంటాడు. తనను గుహలోని మాంత్రికుడి వద్దకు తీసుకెళ్లడానికి విక్రమార్కుడు భుజం మీద వేసుకోగానే… ‘రాజా నీకు శ్రమ తెలీకుండా ఒక కథ చెబుతాను, ఆలకించి నా సందేహాన్ని నివారించు.
నీకు తెలీకపోతే సమాధానం ఇవ్వనక్కరలేదు కానీ, తెలిసీ సమాధానమీయకపోతే నీ తల పగిలి నూరు వక్కలవుతుంది’ అనే హెచ్చరికతో కథలు మొదలుపెడతాడు. ఇక్కడ మరో షరతు ఉంది. మాంత్రికుడి కోరిక మేరకు భేతాళుడిని భుజం మీద వేసుకొన్నాక విక్రమార్కుడు మౌనంగా ఉంటేనే ఆ శవాన్ని గుహ వద్దకు చేర్చగలడు. అయితే భేతాళుడు అడిగే ప్రతి చిక్కు ప్రశ్నకు విక్రమార్కుడు సమాధానం చెప్పగలడు. దాంతో నోరు తెరవక తప్పదు. దీన్నే అవకాశంగా తీసుకొన్న భేతాళుడు తనకు శాపంగా ఉన్న కథలన్నింటినీ విక్రమార్కుడి చెప్పేస్తాడు. అంతేగాక మాంత్రికుడి నిజ స్వరూపం తెలిసింది భేతాళుడికి మాత్రమే.
విక్రమార్కుడి కథల్లోని భేతాళుడు చాలా మంచి వాడు. మహారాజు సాహసంతో మురిసిపోయే భేతాళుడు విక్రమార్కుడు తనను తీసుకొని సన్యాసి దగ్గరకు వెళితే, అతడు రాజుని బలిస్తాడని భేతాళుడికి తెలుసు. గుణాడ్యుడు రాసిన బృహత్కథల ప్రకారం భేతాళ, విక్రమార్కుల సంవాదం అంతా ఒక రాత్రి జరిగినదే! మొత్తం భేతాళుడు 25 కథలను విక్రమార్కుడికి చెబుతాడు. అన్ని కథల చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పిన విక్రమార్కుడు చివరకు ఒక కథ విషయంలో ఓడిపోతాడు. విక్రమార్కుడు సమాధానం చెప్పలేని ఆ కథ గుణాడ్యుడు సంకలనంలో అలభ్యం అని పెద్దలు అంటారు. చివరి కథలో ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న విక్రమార్కుడికి భేతాళుడే హితబోధ చేస్తాడు. సన్యాసి క్రూర త్వం గురించి వివరిస్తాడు. హోమం వద్దకు చేరుకొన్న తర్వాత విక్రమార్కుడే సన్యాసిని కాళికకు బలిస్తాడు. ఆ తర్వాత భట్టి, భేతాళుల సాయంతో కాళికాదేవి ఆశీస్సులతో రెండువేల యేళ్లు ఉజ్జయిని పాలించి స్వర్గారోహణం చేస్తాడు విక్రమార్కుడు.
This website is for sale. If you're interested, contact us. Email ID: [email protected]. Starting price: $2,000